శ్రీ గురుభ్యోన్నమః!
మనం పరాశర స్మృతి యొక్క మొదటి అధ్యాయం లో ఉన్న 24 వ శ్లోకం కనుక చూసుకున్నట్లైతే:
కృతం తు మానవే ధర్మం త్రేతాయాం గౌతమం స్మృతమ్।
ద్వాపరే శాఙ్ఖలిఖితం కలౌ పారాశరం స్మృతమ్॥
అర్థం: కృత యుగంలో ధర్మాన్ని మనువు నిర్దేశించాడు; త్రేతా యుగంలో, ఇది గౌతమునిచే నిర్దేశింపబడింది; ద్వాపర యుగంలో, ఇది శంఖ, లిఖిత స్మృతుల నుండీ వచ్చింది; కలియుగంలో, మార్గదర్శక స్మృతి పరాశరునిది.
ఆ విధంగా తంత్ర గ్రంథాలతో సహా అన్నీ గ్రంథాలు పరాశర స్మృతి ఆధారంగా మనం అర్థం చేసుకుంటేనే మనం ధార్మికులం అవుతాము.
పరాశర స్మృతిలోని అదే మొదటి అధ్యాయం లో ఉన్న 26 వ శ్లోకం చూసుకుంటే:
ధర్మేణ యుగసంధౌ తు ధర్మాణాం స్యాద్విశేషతా।
కలౌ మద్యం చ మాంసం చ త్యాజ్యమాదౌ ప్రయత్నతః॥
అర్థం: యుగాల మార్పుతో, ధర్మంలో నిర్దిష్ట వైవిధ్యాలు ఏర్పడతాయి; కలియుగంలో, ముఖ్యంగా మద్యం, మాంసం వంటి పదార్ధాలను సాధనలో మన పూర్తి ప్రయత్నంతో దూరంగా ఉంచాలి.
ఈ విధంగా సాధన విషయంలో కీలకమైన విషయాన్ని మహర్షుల వారు మనకు అందించి ఉన్నారు.
అలాగే ఈ విషయాన్ని నొక్కి వక్కాణించే మరో 2 శ్లోకాలను కూడా మనం చూద్దాం:
పరాశరా స్మృతి (6:20)
న మాంసం భక్షయేత్ లోకే లోకానాన్ హిత్మిచ్ఛత ॥
సర్వదా సత్యవాచన: సర్వభూతనుకమ్పకః॥
అర్థం: సకల జీవుల శ్రేయస్సును కోరుకునే వ్యక్తి మాంసాన్ని తినకూడదు, ఎందుకంటే ఇది అన్ని జీవుల పట్ల సత్యం మరియు కరుణ సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది.
పరాశరా స్మృతి (6:25) –
మధ్యం బ్రాహ్మణకులనాన్ నోపయుఞ్జిత్ కర్హిచిత్.
న తైరభిన్నం కషాడ్తు హయాశ్రమే వా వనేపి వా ॥
అర్థం: బ్రహ్మాన్ని పొందే మార్గంలో ఉన్న ఎవరైనా, సాధన కోసం, లేదా ఎటువంటి ప్రయత్నం లేని స్థితిలో లేదా అతని హృదయ వనంలో మద్యం వంటి మత్తు పదార్థలను తీసుకోకూడదు, ఎందుకంటే ఇది వారి కులానికి సూచించిన ప్రవర్తనకు విరుద్ధం.
ఇంక మనకు ఇంతకంటే ఆధారాలు అవసరం లేకపోయినా కూడా అసలు తంత్ర గ్రంథాలు మనకు ఏం చెప్తున్నాయో కూడా మనం తెలుసుకుందాం.
కులార్ణవ తంత్రం (14:70)
యుగానుసారతః సాధ్యా న సర్వత్ర విధీయతే।
కలౌ పరోక్షతన్త్రోక్తం సర్వం యచ్చోపదిశ్యతే॥
అర్థం: యుగానికి అనుగుణంగా అభ్యాసాలను మార్పు చేసుకోవాలి; కలియుగంలో, అన్ని ఆచారాలు మరియు సాధనలు, ముఖ్యంగా తాంత్రిక గ్రంథాలలో పేర్కొన్నవి, ప్రతీకాత్మక పద్ధతిలో చేయాలి.
రుద్ర యామళ తంత్రం (8.30)
గుహ్యవిద్యాం కలౌ దేవి న దృశ్యం ప్రత్యక్షసాధనే।
స్వరూపేణ హ్యుపాసేత పరం మన్త్రోత్తమం స్మరన్॥
అర్థం: ఓ దేవీ, కలియుగంలో, గోప్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షంగా అనుసరించకూడదు. బదులుగా, ఒకరు దాని సారాంశంపై దృష్టి పెట్టాలి. అలాగే ఆ సారాంశ తత్త్వం యొక్క మూల మంత్రాన్ని పఠించాలి/జపం చేయాలి.
రుద్ర యామళ తంత్రం (11.45)
మద్యమాంసాదికం సర్వం కలౌ త్యాజ్యం విశేషతః।
పరోక్షరూపేణ యదుక్తం తన్మన్త్రాధిష్ఠితం స్మృతమ్॥
అర్థం: కలియుగంలో, మద్యం, మాంసం వంటి వస్తువులను వాటి అసలైన రూపాల్లో ప్రత్యేకంగా నివారించాలి. బదులుగా, వాటి ప్రతీకాత్మకమైన రూపాలకు మనం కట్టుబడి ఉండాలి, మంత్రాల ద్వారా శక్తివంతం చేయబడిన వాటి నిగూఢ అర్థాలను నలుగురికి చెప్పాలి.
పైనవి రెండూ అంటే సరే, తంత్ర గ్రంథాలు. మరి చాలా మంది ఈ రోజుల్లో “మర్రి చెట్టు కింద కూర్చుని మద్యం తాగి సంభోగం చేస్తే అది కూడా సాధనే” అనే లాంటి వెర్రి వాగుడు వాగటానికి వాడుకుంటున్న సాహిత్యం కాళీ పురాణంలోనిది. మరి ఆ పురాణంలో ఈ విషయాల గురించి ఏం చెప్పారు?
కాళీ పురాణం (20.29-30):
కలౌ పఞ్చమకం సర్వం న వదేద్దృష్టినిగ్రహాత్।
దృష్టం సర్వత్ర పాపేషు న కుర్వీత కథఞ్చన॥న మన్త్రేణ న మునినాః న దేవైః సాద్యతే జనైః।
మూలకర్మవినాశాయ తస్మాన్న పాఞ్చమకం స్మృతమ్॥
అర్థం: కలియుగంలో, పంచ మకరాలతో ముడిపడి ఉన్న స్పష్టమైన అభ్యాసాలను దృశ్యమానంగా అనుసరించకూడదు. ఇటువంటి అభ్యాసాలు వాటి సంకేత రూపంలో కూడా అత్యున్నత స్థాయి స్వచ్ఛత మరియు అంతర్గత అభ్యాసానికి మాత్రమే సరిపోతాయి, సాధారణ ప్రజలకు లేదా దృశ్యమాన ఉపయోగానికి కాదు.
మరి కొందరు ఏమని వాదించే ప్రమాదం ఉంది? అఘోర సాధన వేరు. అందులో ఇటువంటి పరిస్థితి లేదు అని. వారి కోసం, అఘోర సాధనను విపులంగా చర్చించే సాహిత్యాన్ని చూద్దాం.
మహాకాల సంహితా (3.22):
ఆన్తరం భావయేత్ సర్వం బాహ్యం సర్వం వివర్జయేత్।
విశేషేణ కలౌ దేవి నాదికల్పే న సంశయః॥
అర్థం: ఒక సాధకుడు అన్ని సాధనాలను అంతర్గతీకరించాలి, బాహ్య కర్మ చర్యలను త్యజించాలి, ముఖ్యంగా కలియుగంలో అంతర్గత ధ్వని (నాద) ప్రధానమైనది.
తంత్ర సారం (5.13):
పఞ్చమకారమూలం హి సాధ్యం యన్త్రనియన్త్రితమ్।
న కలౌ ప్రత్యక్షమేతన్న పరోక్షం తు కీర్తితమ్॥
అర్థం: కలియుగ మార్గదర్శకాల ప్రకారం, పంచ మకరాల పునాదిని ప్రత్యక్ష చర్యల కంటే ప్రతీకాత్మక క్రమశిక్షణ ద్వారా సాధించాలి.
ఇంతగా ఇన్ని ఆధారాలు ఇచ్చినా కూడా సాధన పేరుతో పంచ మకారాలను ప్రత్యక్షంగానే చేస్తాం, ఎందుకంటే మా గురువులు చెప్పారు అని ఈ పనులు చేసే వారు అనే ప్రమాదం లేకపోలేదు. అయితే గురువులు ఎవ్వరైనా గురు పరంపర ద్వారా వచ్చిన వారే. అంటే ఒక పరంపరలో ఉన్న గురువులు మరో పరంపరలో ఉన్న గురుసామానులు అయిన వారిని గౌరవిస్తారు. అవునా? మరి వామచారంలోనే ఉన్న ఇతర గురువులు పై శ్లోకాలకు తాత్పర్యాలు రాశారు. అవి చూద్దాం.
కులార్ణవ తంత్రంలోని పంచ మకారాల గురించి మాట్లాడే శ్లోకాల గురించి స్వామి భైరవానంద గారు ఏమన్నారు?
– పంచ మకరాలు భౌతిక పరిమితులు, భ్రమలను అధిగమించడానికి సంకేత సాధనాలు అని అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకాలను ఉపయోగం చేసుకోండి. కలియుగంలో, ప్రజలలో తమస్సు (అజ్ఞానం) మరియు రజస్సు ప్రధాన లక్షణాలుగా ఉండటం చేత ప్రత్యక్ష విధానం సిఫార్సు చేయబడదు.
మరి కాళీ పురాణంలోని శ్లోకాల గురించి వామాచార ఋషి భట్ట భాస్కరుల వారు ఏమన్నారు?
కలియుగం ధర్మ క్షీణతతో గుర్తించబడిందని, ప్రత్యక్షమైన సాధనాలను అనుచితంగా మారుస్తుందని వారు చెప్పారు. అంతర్గత శుద్దీకరణ మరియు ప్రతీకాత్మక చర్యలపై దృష్టి కేంద్రీకరించాలి, బాహ్య భోగానికి బదులుగా స్వీయ-నిగ్రహం మరియు అంతర్గత సాక్షాత్కార మార్గంతో సమలేఖనం చేయాలి అని కూడా వారు తన తాత్పర్యంలో పేర్కొన్నారు.
అలాగే రుద్ర యామళ తంత్రంలోని పంచ మకార పద్ధతి గురించి స్వామి విమలానంద గారు ఏమని వ్యాఖ్యానించారు?
కలియుగానికి అనువైన ప్రతీకాత్మకమైన, అంతర్గత వివరణలను ప్రస్తావిస్తూ, రుద్ర యామళ తంత్రం ప్రత్యక్షమైన వివరణల దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్న గ్రంథం కనుక దానిని గురువుల వద్దే అభ్యసించాలి అని పేర్కొన్నారు.
ఆయనతో పాటు యోగిని భూషణ కూడా పంచ మకరాల యొక్క రహస్య అర్థాలను నొక్కి చెప్పడానికి ఈ గ్రంథాలను అర్థం చేసుకోమని సాధకులకు చెప్పారు. కలియుగ సందర్భంలో ప్రత్యక్ష పద్ధతులను విమర్శించారు.
పైన పేర్కొన్న వారంతా సర్వ తంత్ర సర్వ క్రియా అధికారం ఉన్న స్వతంత్ర వామాచార లేదా అఘోర సాధకులే. గురు సమనులే. మరి వారి మాటలను కూడా నేను లెక్క చేయను.
ఎందుకంటే న గురోరధికం అనే వాక్యాన్ని వాడుకుని సాధన పేరుతో పంచ మకారాల ప్రత్యక్ష ఉపయోగానికి పాల్పడతాము అంటే, ఇక అది వారి ఖర్మ.
నేను మద్యం, ఇతర మత్తు పదార్థాలు, మాంసం, మత్స్యం – వీటి స్వీకరణకు కానీ, సంభోగం అది వారి ఆలోచనను బట్టి ధర్మ పతీ / లేదా పత్నీతో కాకుండా ఇతరులతో సహా ఎవరితో అయినా చేయటానికి కానీ, అస్సలు వ్యతిరేకం కాదు.
అది మీ వ్యక్తిగతం. మీ ఇష్టం.
నా సమస్య కేవలం దానికి సాధన పేరు ఇవ్వటంతోనే.
అలా చేయటం శాస్త్ర విరుద్ధం.
శాస్త్ర విరుద్ధమైన పనులు చేసే వారు హైందవులు కాదు.
ఆదేశ్! ఆదేశ్!
- ఉగ్రా

