ఇప్పుడు మనం సనాతనం, వైదీకం, హైందవం అని పిలుస్తున్న ధర్మానికి మొదలు ఏంటి?

వైదీకం అంటే వేదం నుండీ ఉద్భవించినది అని అర్థం. ఇది మనకు అపౌరుషేయ మూలం. ధర్మం అనేది కాలంతో సంబంధం ఉన్న విషయం కాదు. మనిషి అనే వాడు లేనప్పుడు, పశు పక్షాదులు కూడా లేనప్పుడు, క్రిమి కీటకాలు వేటి నుండీ అయితే మిగతా అన్నీ రకాల జీవాలు వచ్చాయో అవి కూడా లేనప్పుడు, కనీసం ఈ భూమి, మన సూర్య మండలం కూడా లేనప్పుడు కూడా, విశ్వంలో ధర్మం ఉంది. ఇది అనాది కాలంగా ఉన్న విషయం. అదే సనాతనం.

మరి హైందవమో?

హిందూ అనే పదానికి మూలం మనం వేదంలో నుండీ మొదలకుని పురాణాలలో, యజుర్ వేదం నుండీ ఉద్భవించిన పార్సీ అనే మతం వారి పుస్తకాలలో కూడా చూడవచ్చు. ఇవన్నీ క్రైస్తవం, ఇస్లాం అనే రెండు మతాలు ఇంకా పుట్టను కూడా పుట్టక ముందరి దర్శన సాహిత్యం. కనుక “వాడేవడో పిలిచాడు, అందుకే ఇలా, హిందూ అంటే మూర్ఖుడు అని అర్థం” అని తప్పుడు ప్రచారాలు చేసే వారికి ఈ కింది ప్రమాణాలను చూపించండి.

ఋగ్వేదంలోని 10 వ మండలంలోని, 75 వ సూక్తంలోని, 6 వ రిచను మీరు చూస్తే అది ఈ విధంగా ఉంది –

ఏతే సస్రుర్యో విషితస్తతర్ద సస్వాన గోజీత పృతనీయ ఆఙ్గే।
ఏతే సిన్ధుం పరిస్తువన్త్యుక్థైర్య ఇమే ధిష్ణ్యవః సోమే అర్పితాః॥

దీని అర్థం వచ్చేసి – వీటిల్లో పర్వతములను చీల్చి చెండాడే ప్రవాహాలు, గర్జిస్తూ ఉండే, శక్తివంతమైన, జలప్రదాతలు (జలప్రదాతలైన ఇతర నదులు), ‘సింధుని’ స్తోత్రాలతో స్తుతించాయి. ఈ బలిపీఠాలు సోమయాగంలో ఉపయోగం కోసం ఏర్పాటు చేయబడ్డాయి.

దీనిని విడిగా చూస్తే మనకు ఏమి అర్థం కాదు. అయితే ఋగ్వేదంలోని 10 వ మండలంలోని, 75 వ సూక్తం పేరు ‘నదీస్తుతి సూక్తం.’ ఈ సూక్తం యొక్క మంత్ర ద్రష్ట మహర్షి వశిష్టుల వారు. ఈ సూక్తంలోని మొదటి రెండు రిచల్లో గంగా, యమునా, సరస్వతీ నదులను ఆయన ఆవహానం చేసి, వాటిని పొగడటాన్ని దర్శించారు. ఆ పై 3 నుండి 5 వరకు ఉన్న రిచల్లో ఈ పవిత్ర నదుల వైభవాన్ని, భారతావనిలో నివసించే ప్రజలకు ఈ నదులు ఎందుకు ముఖ్యం, వంటి విషయాలను దర్శించారు. ఆ పై ఆరవ రిచలో మిగతా ఈ పుణ్య నదులు సింధూ నదిని పొగడటాన్ని దర్శించారు.

ఇప్పుడు మనం పైన ఇచ్చిన అర్థాన్ని చదువుకుంటే విషయం అవగతం అవుతుంది.

అయితే హిందూ పదం గురించి మాట్లాడటం మానేసి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ సింధూ నదిని హిందూ నది అని కూడా మనం పిలవచ్చు. ఎలా అంటారా?

“స” – “హ” ఈ రెండు శబ్దాల పరస్పర మార్పిడి అనేది ప్రాచీన సంస్కృత శబ్దశాస్త్రం, అలాగే వ్యాకరణంలో గుర్తించబడిన భాషా లక్షణం. ఈ విషయం ప్రతిశాఖ్యా గ్రంథాలలో దర్శింపబడింది. ఇవి వేదాలకు సంబంధించిన శబ్దశాస్త్రం మనకు అవగతం చేసే గ్రంథాలు. ఈ “స” – “హ” శబ్దాల పరస్పర మార్పిడి గురించి ఉన్న సూక్తం ఏది?

ఋగ్వేద ప్రతిశాఖ్య లోని 14 వ అధ్యాయంలో 3 వ సూత్రం ఇది –

సస్య హస్య చ యో రూపం ద్వితీయం తదుదాహృతమ్।

పై వాక్యానికి అర్థం ఏంటి?
రెండవ సందర్భంలో ‘స’ – ‘హ’ ల స్వరూపం ఒకే విధంగా ఉంటుంది.

అంటే, కొన్ని శబ్ద సందర్భాలలో, ముఖ్యంగా వేద మంత్రోచ్ఛారణ లేదా పారాయణంలో, ‘స’ శబ్దాన్ని ‘హ’ అని ఉచ్చరించవచ్చని ఈ పరస్పర మార్పిడి నియమం పేర్కొంది. ఈ నియమం ప్రాచీన ఉచ్చారణ – పారాయణ పద్ధతులను ప్రతిబింబిస్తూ, సాంప్రదాయ సంస్కృత నియమాలను మనకు తెలియపరుస్తోంది. ఈ విషయమే ఇతర వ్యాకరణ సంబంధిత వేదాంగలు అయిన, ‘శిక్షా’ వంటి గ్రంథాలలో కూడా మనం చూడవచ్చు.

దీనికి సంబంధిత శిక్షా సూత్రం, ఆ సూత్రానికి అర్థం కూడా నేను ఇవ్వగలను. ఇప్పటికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు కనుక దానిని ఇక్కడ ఇవ్వటం లేదే కానీ, సూత్రం అయితే నూటికి నూరు శాతం ఉంది. అవసరం అనుకున్న వారు అడిగితే, ఇస్తాను.

మొత్తం మీద సారాంశం ఏమిటి? వేదాల్లోనే ‘హిందూ’ పదం ప్రాంతీయంగా ఉచ్ఛరించే విధానాన్ని బట్టి, మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మరి ఏ ప్రాంతపు వేద పండితులు ఇలా పలుకుతారు? పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఋగ్వేద పండితులు ఇలా పాలకటాన్ని నేను విన్నాను.

సరే ఇప్పుడు వేదంలో అయితే హిందూ పదం ఉంది అని నిరూపణ చేసేశాం. మరి ఇతర ధర్మ గ్రంథాల సంగతేమిటి?

మహాభారతంలోని అశ్వమేధిక పర్వంలో 83 వ అధ్యాయంలోని 11 వ శ్లోకం –

ఆర్యావర్తం హి శ్రేష్ఠం, బ్రాహ్మణానాం తపోధనమ్।
హిన్దుస్థానమితి ఖ్యాతం, ప్రాజ్ఞా వేదవిదో విదుః॥

హిందుస్తాన్ అనే పదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.

ఆష్టాదశ మహాపురాణాలలో ఒకటైన భవిష్య పురాణం లోని బ్రహ్మపర్వంలోని, 4 వ అధ్యాయంలోని 19 వ శ్లోకం –

వన్దే మాతరం హిన్దుస్తానం, యత్ర జాతాః కిల శక్తయః।
సిన్దుస్థానే నదీషు పుణ్యా గఙ్గా, యమునా, చ సరస్వతీ॥

మళ్ళీ హిందుస్తాన్ అనే పదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.

అలాగే కాళికా పురాణంలోని 18 వ అధ్యాయంలోని 10 వ శ్లోకం –

హిన్దవః ప్రదీప్త్యగ్న్యా, ధర్మేణ విజయినః।
వేదమార్గేణ యుక్తాశ్చ, త్రైలోక్యే సుచరీతినః॥

హిందూ అనే పదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.

ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో చోట్ల ఈ హిందూ పదం మనకు, మన హైందవ సాహిత్యంలోనే దర్శనం ఇస్తుంది. అయితే క్రైస్తవ, ఇస్లాం మతాల కంటే ముందరే మన నుండే వేరు పడ్డ మతం పార్సీలది. వారు తమ మత గ్రంథం అయిన జెండ్ ఆవేస్తాలో విదేవ్దత్ అనే అధ్యాయంలో, ఫర్గార్డ్ ఉప విభాగంలో మొదటి భాగంలోని 18 వ వాక్యంగా రాసుకున్నది –

పఞ్చదశ హ య అహ్మై హ్యవ అచ్ఛికయ్యత్

న్దు: పఞ్చదశ హ య అహ్మై హ్యవ అచ్ఛికయ్యత్।

ఈ పై వాక్యం ఆవేస్తన్ అనే భాషలో ఉంది. దీని అర్థం – “నేను, అహురా మజ్దా సృష్టించిన మంచి భూములలో పదిహేనవది, మంచి భూముల దేశాలలో పదిహేనవది ఏడు నదుల హప్త హిందూ భూమి.”

అలా రెండూ సార్లు ఒకటే విషయం చెప్పటం జెండ్ ఆవేస్తా పుస్తకంలో నొక్కి చెప్పటం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి అని పార్శీ సాహిత్యపు పండితులు నాకు తెలిపారు.

మళ్ళీ సారాంశం అయితే ఇది –

“వాడేవడో పిలిచాడు, అందుకే ఇలా, హిందూ అంటే మూర్ఖుడు అని అర్థం” లాంటి వ్యర్థ ప్రేలాపనలను మనం ఈ ఆధారాలతో తిప్పి కొట్టచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *